24.2.09

వై.ఎస్.తెలంగాణాకి అర్థం ఏమిటి ?

ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది.ఎత్తులు, పైఎత్తులు వేయడంలో మన రాజకీయ పార్టీలు తలమునకలై ఉన్నాయి.వ్యూహ, ప్రతివ్యూహల విషయంలో మన రాజకీయనాయకుల మధ్య పోటీ పెరిగింది. తెలంగాణా విషయంలో ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి చేసిన ప్రకటన ఇందుకు తాజా ఉదాహరణ.

ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సూత్రప్రాయంగా ఎటువంటి అభ్యంతరం లేదని,ఈవిషయంలో నిర్ణయాత్మక చర్యలు తీసుకోవలసిన సమయం ఆసన్నమయిందని ఇతర ప్రాంతాల ప్రజలు అభ్యంతరాలను, ఆందోళలను పరిష్కరించవలసి ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఈమాటలు విన్న వారెవరైనా ముఖ్యమంత్రికి ఇంత ఆకస్మికంగా జ్ఞానోదయం ఎందుకు కలిగిందనే సందేహం కలుగకమానదు. ప్రత్యేక తెలంగాణా ప్రతిపాదనను తెలుగుదేశం పార్తీ హయాంలొనే తమ పార్టీ లేవనెత్తిందని, 2004నాటి ఎన్నికల మానిఫిస్తో లో ఈఅంశాన్ని చేర్చామని ముఖ్యమంత్రి వెనకటి కధను గుర్తుచేయడంవల్ల సందేహాలు తీరకపోగా కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి.

కాంగ్రెస్ ప్రెత్యేక తెలంగాణా ఏర్పాటుకు సుముఖంగా ఉంతే ఈ ఐదేళ్ళలో ఆదిశగా ఏవిధమైన చర్యలు చేపట్టకపోవడానికి కారణం ఏమిటి? ఈప్రశ్నకు కూడా ముఖ్యమంత్రి సమాధనాలు చెప్పారు. ఆజవాబులను,వాటిలో హేతుబధ్ధతను ఇప్పుడు పరిశీలిద్దాము. 2004లో కాంగ్రెస్ నాయకత్వాన కేంద్రంలో యు.పి..ప్రభుత్వం ఏర్పాటు కాగానే టి.ఆర్.ఎస్.సూచనమేరకు ఏకభిప్రాయ సాధన కోసం ప్రణబ్ ముఖర్జ్గీ కమిటీని ఏర్పాటుచేసిందని,కాని ఆకమిటి ఏకభిప్రాయాన్ని సాధించలేకపోయిందని, అప్పటినుండి తమపార్టీ ఈసమస్యకు పరిష్కారం ఆలోచిస్తూనే ఉందని, ఇందులో కొందరికి ఉన్న అభ్యంతరాల పరిష్కారానికి మార్గాలు కూడా అన్వేషించవలసి ఉందని వై.ఎస్.వివరించాఉ.కాని ఈమాటలు "తాడిచెట్టు ఎందుకెక్కావని అడిగితే దూడగడ్డి కోసం" అని జవాబు చెప్పిన చందంగా ఉన్నాయి.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేయాలని ఖచ్చితంగా నిర్ణయించుకున్నవారు అనుసరిచవలసిన పద్థతి ఇదికాదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై అనుకూల, ప్రతికూల వాదుల అభిప్రాయాలను సేకరించి సమన్వయం సాధించడానికి ప్రయత్నించాలి.దీనిపై అభ్యంతరాలు సందేహాలు లేవనెత్తినవారికి సంత్రుప్తికరమైన సమాధానాలు చెప్పగలిగి ఉండాలి.కాని గత ఐదేళ్ళలో కాంగ్రెస్ అటువంటిపని చేయలేకపోయింది. ఏకాభిప్రాయసాధనలో ప్రణబ్ కమిటి వైఫల్యం వల్లనే తాము ఏనిర్ణయం తీసుకోలేకపోయామంటే కాంగ్రెస్ చిత్తశుధ్దిపై సందేహాం కలుగకమానదు. ప్రత్యేక తెలంగాణా ఏర్పాటువల్ల రాష్ట్రానికి,దేశానికి మేలు కలుగుతుందనే ద్రుఢమైన నమ్మకం కాంగ్రెస్ కి నిజంగా ఉంటే ఇతర పార్టీలను కాంగ్రెస్ ఒప్పించగలిగి ఉండేది. ప్రత్యేక తెలంగాణాపై అనుకూల, ప్రతికూల వాదుల అభిప్రాయాలను సేకరించి సమీక్ష జరిపి ఉంటే ఈసమస్య అపరిష్క్రుతంగా మిగిలిపోయి ఉండేదికాదు.

ప్రత్యేక తెలంగాణాను మనపార్టీలు రాజకీయ సమస్యగా పరిగణిస్తున్నయి తప్ప అభివ్రుధికి సంబంధించిన అంశంగా భావించడంలేదు. తెలంగాణా ఏర్పాటు రాష్ట్రాభివ్రుధికి ఎలా తోడ్పడుతుందనే అంశంపై కూలంకషంగా అధ్యయనం చేస్తే పరిష్కారం ఏనాడో లభించి ఉండేది.ఈ సంధర్భంలో కేవలం తెలంగాణా అభివ్రుధిని గురించి మాతమేగాక రాయలసీమ,ఆంధ్రా ప్రాంతాల భవిష్యత్తుని కూడా ఆలోచించడం శాస్త్రీయమైన పధ్ధతి. అన్ని ప్రాంతాల వారికి సమానంగా అభివ్రధి చెందడానికి అనువుగా రాష్ట్ర విభజన ప్రతిపాదన ఉండాలి.కొన్ని ప్రాంతాల ప్రయోజనాలకే ఆటంకం కలిగే ప్రమాదం ఉంటే ఆసమస్య పరిష్కారించడానికి తక్షణ చర్యలు చేపట్టాలి. ఆతర్వాత రాష్ట్ర విభజన జరిగినా ఎవరికీ అభ్యంతరం ఉండదు. అందరికీ ఆమోదయోగ్యమైన ఈపధ్ధతిని అనుసరించడానికి కాంగ్రెస్ తన ఐదేళ్ళ పాలనలో ఏనాడూ ప్రయత్నించలేదు.

ఐదేళ్ళలో ఈవిషయం గురించి చిత్తశుధ్ధితో ఆలోచించలేకపోయిన ప్రభుత్వం ఇప్పుడు చెబుతున్న మాటలను ప్రజలు నమ్ముతారా?ఎన్నికల షెడ్యూలు వెలువడేలోగా ప్రభుత్వం ఉభయ సభల సభ్యులతో కమిటే వేయడం సాధ్యమేనా? ఒకవేళ కమిటి ఏర్పడినా ఈ స్వల్ప వ్యవధిలో తెలంగాణా అంశంపై అధ్యయనం నిష్పాక్షికంగా, పారదర్సకంగా జరుగుతుందన్న నమ్మకం ఏమిటి?తూతూమత్రంగా అధ్యయనం జరిగితే ప్రయోజనం ఉంటుందా? ఒకవేళ అధ్యయనం సక్రంగా పూర్టయినా ఎన్నికల ముందు రాష్ట్ర విభజనకు ఎన్నికల కమీషను అంగీకరిస్తుందా?

అంటే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణా గురించి చేసిన తాజా ప్రకటన అమలు జరగడానికి ఇన్ని ఆటంకాలు ఉన్నాయి. ఈవిషయం కాంగ్రెస్ కు తెలియదనుకోవడం అమాయకత్వమే. అన్నీ తెలిసే కాంగ్రెస్ ఈ ప్రకటన చేసిందంటే ఇది కేవలం కంటి తుదుపు చర్య అని ఎవరికైనా సులభంగా అర్ధమవుతుంది. తెలంగాణా అంశాన్ని ప్రతిపక్షాలు ఎన్నికల అస్త్రంగా వినియోగించుకోకుండా ఉండడానికే కాంగ్రెస్ ఈ పాచిక విసిరిందని గ్రహించడం పెద్ద కస్టమేమికాదు.

ప్రత్యేక తెలగాణా ఏర్పాటు అత్యంతావశ్యకమని ప్రజలంతా ఇదే కోరుతున్నారని అన్ని పార్టీలవారు ప్రచారం సాగిస్తున్నారు. తెలంగాణా కు వ్యతిరేకంగా మాట్లాడేవారికి ఓట్లు రాలవని అన్ని కూటములు పేర్కొంటున్నాయి. అన్ని పార్టీల లక్ష్యం అదే అయినప్పుడు ఇన్నికూటములు,కుంపట్లు ఎందుకు?ఇంతకీ ప్రత్యేక తెలంగాణా అవసరమా కాదా అని నిర్ణయించవలసినవారు ప్రజలే.ఇందుకు అవసరమైన ఆయుధం ఓటు వారి చేతిలోనే ఉంది.మరొకరకంగా చెప్పలంతే రాబోయే ఎన్నికలను ప్రత్యేక తెలంగాణాపై రిఫరెండంగా భావించవచ్చు.ఆ రిఫరెండం జరిగిన తర్వాతే ఈవిషయంపై నిర్ణయం తీసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం.


ఎం.వి.రమేష్.

No comments: