24.5.09

పార్టీల బాకాలుగా పత్రికలు


సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి,ప్రభుత్వ అక్రమాలను ఎండగట్టడానికి,రాజకీయ నాయకుల మాయలో పడకుండా ప్రజలను కాపాడానికి తోడ్పడే ఒక బలమైన శక్తిగా పదునైన ఆయుధంగా పత్రికా రంగం పేరు పొందింది.సమాజంలో జరిగే అన్యాయాలను అరికట్టడానికి,పేదలకు,అర్హులకు న్యాయం జరిగే విధంగా పత్రికలపై ఒత్తిడి తీసుకురావడానికి రాష్ట్రంలోని పత్రికలు గతంలో క్రుషి చేసేవి.సామాజిక శ్రేయస్సు కోసం తమ సర్వస్వం త్యాగం చేయడానికి ఆనాడు జర్నలిస్టులు కంకణం కట్టుకొనేవారు.పత్రికలు ప్రచురించే అంశాలకు అప్పట్లో ప్రభుత్వం,ప్రజలు అత్యంత విలువ ఇచ్చేవారు.ఒకరకంగా చెప్పాలంటే గతంలో పత్రికలు సమాజగతిని నిర్దేశించేవి.

కాని ఈనాడు రాష్ట్రంలో పత్రికల పరిస్థితి ఆవిధంగాలేదు.పత్రికలకు పూర్వం ఉన్న గౌరవం, విశ్వసనేయత ఈనాడు క్రమంగా అడుగంటి పోతున్నాయని పూర్వపు తరాలకు చెందిన మేధావులు,పాఠకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమ ఆదర్సాలు కలిగిన జర్నలిస్టుల చేతిలో ఆయుధంగా గతంలో గుర్తింపు పొందిన పత్రికలు ఈనాడు రాజకేయ పార్టీలకు మానసపుత్రికలుగా, పెట్టుబడిదారుల దురాశలకు,రాజకీయ నాయకుల కుట్రలకు ఆలవాలంగా మారిపోయాయని పత్రికారంగంగా పవిత్ర చరిత్ర తెలిసిన పెద్దలు విమర్సిస్తున్నారు. ఇటీవలి ఎన్నికల సంధర్భంగా రాష్ట్రంలో మన పత్రికలు వ్యవహరించిన తీరు అత్యంత జుగుప్సాకరంగా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.ప్రజల శ్రేయస్సుకు అవసరమైన మార్గాలు సూచించడానికి బదులు,ఆయా రాజకీయపార్టీలకు బాకాలుగా,తమను పోషిస్తున్న రాజకీయ పార్టీలకు కరపత్రాలుగా,తొత్తులుగా రాష్ట్రంలో వివిధపత్రికలు వ్యవరించాయని వారు వ్యాఖ్యానిస్తున్నారు.ఆయాపార్టీల ప్రాపుకోసం పత్రికలు చేసే కసరత్తులో సామాన్య ప్రజలప్రయోజనాలు నలిగిపోతున్నాయని వారు ఆదోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆత్మస్తుతి,పరనింద ప్రధానంగాసాగే రాజకీయ నాయకుల ప్రసంగాలను ప్రచ్య్రించడమే ప్రధానంగా పత్రికలు నడక సాగించడం సమంజసంగా లేదని పలువురు పాఠకులు పేర్కొంటున్నారు. మననాయకుల హామీలను, వాగ్దానాలను,మానిఫిష్టోల ప్రకటించిన పధకాల అసంబధతను,అవి కలిగించే అయోమయాన్ని ఎండగట్టడానికి పత్రికలు సాహసించలేదనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి.కాగా తాము శత్రువులుగా భావించే పార్టీల పధకాలపై,ఆ నాయకుల ప్రసంగాలపై దుమ్మెత్తి పోయడానికి మాత్రం పత్రికలు వెనుకాడకపోవడం మరొక విడ్డూరమనే వ్యాఖ్యలు కూడా వినవస్తున్నాయి.తమ పత్రికలను పోషించే పార్టీ నాయకుల చర్యలను వెనకేసుకురావడం ఇతరపార్టీల నాయకుల తప్పులు వెదకడం ఈపత్రికల ప్రధాన కర్తవ్యంగా మారిపోయింది.నైతిక విలువల కంటే స్వార్ధ ప్రయోజనాలకు అధికప్రధాన్యం ఇచ్చే రాజకీయ పార్టీల కనుసన్నలలో నడిచే ఈపత్రికలు ప్రజల కోసం పనిచేస్తాయనుకోవడం వట్టి భ్రమగానే మిగిలిపోతుందేమోనని పత్రికా రంగాన్ని గౌరవించే పెడ్డలు పేర్కొంటున్నారు.

ఈవిధానం ఇలాగేకొనసాగితే పత్రికలు తమ విస్వసనీయతను కోల్పోయే ప్రమాదం ప్రమాదం ఉందని పలువురు అందోళను వ్యక్తం చేస్తున్నారు.భవిష్యత్తులో రాజకీయ ఆరంగ్రేటం చేయలనుకున్న వారు ముందుగా ఒక పత్రికను ప్రారంభించడం భవిష్యత్తులో ఒక సంప్రదాయంగా మారవచ్చు. తాము చేసిన కుంభకొణాలను కప్పిపుచ్చడానికి రాజకీయ నాయకులకు పత్రికలు వేదికలుగా తోడ్పడే అవకాసం ఉందని అభిప్రాయం కూడా ప్రజానీకంలో ఉంది.ఈపరిస్థితులు మెరుగుపడే మార్గాలను వెతకవలసిఉంది. ఇదే ధోరణి వచ్చే ఎన్నికల నాటికి పత్రికల ప్రచురణపై కూడా ఎన్నికిల సంఘం ఆంక్షలు విధించే అవకాశం ఉంది.

పత్రికలను ప్రజలు కేవలం ఆయాపార్టీల జేబు సంస్థలుగా మాత్రమే గుర్తించే దురవస్థ కూడా దాపురించవచ్చు కనుక రాజకీయ నాయకులు పత్రికలను స్థాపించడానికి కాని,వెన్నముకగా నిలచినడిపించడానికి కాని అవకాశంలేని విధంగా చట్టాలు రావాలి.కేవలం జీతం రాళ్ళ మీద బ్రతికే పాత్రికేయులు ఈవిధంగా ఈఅక్రమాలను ఎదిరించలేని దుస్థితిలో ఉన్నారు.కనుక పత్రికలను పాత్రికేయ వ్రుత్తిని గౌరవించే పెద్దలు పత్రికారంగానికి పూర్వవైభవం సాధించి పెట్టడానికి ఉద్యమాలు నిర్వహించాలి. ఈధోరణి ఇలాగే కొనసాగితే పత్రిక స్వేచ్ఛ పెట్టుబడిదారిఎల ఇష్టారాజ్యంగా, రాజకీయా నాయకుల అన్యాయలకు,అక్రమాలకు లైసెన్సుగా మారిపోవడం తధ్యమని పత్రికా స్వేచ్ఛను కోరే పెద్దలు ఆవేదన చెందుతున్నారు.పత్రికారంగానికి పూర్వవైభవం సాధించడానికి,పెట్టుబడిదారుల కబంధ హస్తాల నుండి పత్రికలను కాపాడటానికి ప్రతి పౌరుడు క్రుషి చేయవలసి ఉంది.

ఎం.వి.రమేష్

1 comment:

Shiva Bandaru said...

పత్రికారంగం పై మంచి విశ్లేషణ అందించారు . పత్రికల నుంచి గతం లోని నిబద్దత ఇప్పుడు ఆశించడం అత్యాసే .