Showing posts with label తెలుగు. Show all posts
Showing posts with label తెలుగు. Show all posts

5.8.09

రాజకీయ సుడిగిండంలో మహిళా రిజ్జర్వేషన్ బిల్లు

మహిళాభ్యుదయం,మహిళాస్వేఛ గురించి ఉపన్యాసాలు దంచే 'మగా'నుభావులు ఈపవిత్ర భారత దేశంలో అసంఖ్యాకంగా ఉన్నారు. కాని మహిళలకు చట్టసభలలో 33శాతం రిజర్వేషన్ కల్పించడానికి ఉద్దేశించిన బిల్లు మాత్రం 13సంవత్షరాలుగా అతీగతీలేకుండా మూలనపడి ఉంది.స్త్రీ స్వేఛను వ్యతిరేకించే చంధస వాదులు, భారతీయ సంస్క్రుతిని అమితంగా ఆరాధించే సంప్రదాయ వాదులు ఈబిల్లుకు గ్రహణం పట్టడానికి కారకులుకాదు. ఎందువల్లనంటే ప్రాచీనభారతీయ సప్రదాయం స్త్రీ స్వేఛకు వ్యతిరేకంకాదు.వేద విద్యల్,యుద్ధవిద్యలలో ఆరితేరిన మహిళామణులు ప్రాచీన భారత దేశంలో ఉండేవారనడానికి ఆధారాలు ఉన్నాయి. రాజకీయ మంత్రాంగంలో సైతం ఆనాటి మహిళలు పాలు పంచుకొనేవారు.

వేదమంత్రాలలో భాగస్వాములైన మహిళలు దాదాపు 20మంది మంత్రదష్టలైన మహిళలను ౠషీకలుగా పిలిచేవారు.మైత్రేయి,అపాల,ఘోష వంటి ౠషీకలకు అలనాటి సమాజంలో సముచిత రీతిలో గౌరవించేది కాని అవమానించలేదు.బాల్యవివాహాలు,సతీసహగమనం వంటి దురాచారాలు,విదేశీ దాడులు,పరిపాలన వల్ల భారతీయ సమాజంలో అంకురించిన దుస్టసంప్రదాయాలు.అంతేగాని ప్రాచీన భారతీయ సంస్క్రుతికి సంకేతాలు కాదు. వేదకాలం నుండి స్త్రీలను గౌరవించిన ఈదేశంలో మహిళాబిల్లు అటకకెక్కడం శోచనీయం.

మహిళలకు 33శాతం రిజర్వేషన్ కోసం ఉద్దేశించిన బిల్ల్కు 13ఏళ్ళు నిండాయి కాని బాలారిష్టాల నుంచి మాత్రం ఈబిల్లు గట్టెక్కలేదు. ఈబిల్లును 1996,1998 మరియు 1999 సంవత్షరాలలో లొక్ సభలో ప్రవేశపెట్టారు. 2008లో రాజ్యసభలో దీనిని ప్రవేశపెట్టగా పార్లమెంటు స్టాండింగ్ కమిటీ పరిశీలనకోసం పంపించారు.కాని ఈనలుగుసార్లు ఏకాభిప్రాయం కుదరక బిల్లు అమోదానికి నోచుకోలేదు. ఈసంవత్షరం జరిగిన ఎన్నికలలో తిరిగి అధికారం చేపట్టిన యు.పి.ఎ ప్రభుత్వం ఈబిల్లుకు బూజుదులపాలని సంకల్పించింది. దీనితో బిల్లుపై మళ్ళీ వివాదానికి తెరలేచింది.కొన్ని వర్గాలు దీనిని త్రీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈబిల్లువల్ల కొందరు చట్టసభలలో ప్రవేశించే అవకాశం కోల్పోతారని లల్లుప్రసాద్, మూలాయంసింగ్ యాదవ్,శరద్ యాదవ్ వంటి ప్రముఖనాయకులు వాదిస్తున్నారు. ఈబిల్లును త్రీవ్రంగా వ్యతిరేకించనన్నుట్టు కూడా వారు తెలిపారు.కేవాల్మ్ ఒక వర్గం మాత్రమే దీనిని వ్యతిరేకించడం గమనార్హం.ప్రస్తుతం చట్టసభలలో రిజర్వేషన్ కూటా పొందుతున్న ఎస్.సి,ఎస్.టి,బి.సి లకు మహిళారిజర్వేషన్ బిల్లువల్ల ఏవిధమైన నష్టం ఉండదు. ఈవర్గాలకు రిజర్వేషన్ అయిన స్ధానాలను మహిళలకు కేటాయించవలసివస్తే అక్కడా ఆయా వర్గాలకు చెందిన మహిళలను పోటీకి నిలబెట్టవచ్చు. కనుక ఆయావర్గాల హక్కులకు ఎటువంటి ప్రమాదంలేదు. ప్రస్తుతం ఒబిసి లకు చట్టసభలలో రిజర్వేషన్ లేదని, ఈబిల్లు వల్ల వారికి నష్టం జరుగుతుందని కొందరి వాదన. కాని ఒబిసి లకు రిజర్వేషన్ లేదనే వంకతో మహిళల హక్కులకు అడ్డుపడటం ఎంతవరకు సమంజసం? తమ హక్కులకోసం పోరాడటానికి బదులు ఇతరుల హక్కులను ఆటంకపరచడానుకి ప్రయత్నించడం న్యాయం కాదు. కనుక తమకు న్యాయం జరపాలని ఒబిసిలు ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకురావాలి. అంతేకాని ఈబిల్లును ఆతంకపరిచి 'మహిళావ్యతిరేకు ' లని ముద్రవేయించుకోవడం సబబుకాదు.

ఈసందర్భంలో మూలాయంసింగ్ యాదవ్ చేసిన ఒక సూచననుకూడా పరిశీలించడం అవసరం.ఆయా పార్టీలు అంతర్గతంగా 20శాతం సీట్లు మహిళలకు కేటాయించాలని అలాచేయని పార్టీలకు గుర్తింపు రద్దు చేయాలని ఆయనకోరారు.చట్టసభలలో మహిళల పాత్ర 20శాతానికి పరిమితమ్మైపోతుంది. అంతేగాక పార్టీపరమైన రిజర్వేషన్ లలో అన్నిపార్టీలు ఒకేతాటిపై నడవాలన్న నియమంలేదు. అటువంటి పరిస్ధితిలో మహిళలకు న్యాయంకంటే అన్యాయమే ఎక్కువగా జరుగవచ్చు. ఉదాహరణకు ఒక పార్టీ కాకినాడలోను,మరొక పార్టీ రాజమండ్రి లోను అభ్యర్ధులను నిలబెట్టవచ్చు.పొరపాటున ఈరండు చోట్ల మహిళలు ఓడిపోతే మొదటికే మోసంవస్తుంది. కనుక పార్టీ పరంగా గాక ప్రభుత్వపరంగానే మహిళలకు 33శాతం రిజర్వేషన్లను అమలుచేయడం ఉత్తమం. కనుక ఈబిల్లుపై అన్ని వర్గాలవారు ఒక అంగీకానికి వచ్చి అందరికి న్యాయం జరిగేలా చూడడానికి ప్రయత్నిచాలి.అంతేతప్ప మహిళారిజర్వేషన్ బిల్లును రాజకీయ సుడిగుండంలో పడవేయకూడదు. ఈవిషయంపై అన్నిపార్టీలు,అన్ని వర్గాలు నిష్పాక్షికంగా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలి.

ఎం.వి.రమేష్

14.7.09

గూగుల్ దెబ్బ మైక్రోసాఫ్ట్ అబ్బా?

సాఫ్ట్ వేర్ రంగాన్ని పరిశీలించే వారికి రెండు రకాల వాళ్ళు తారసపడుతుంటారు. మైక్రోసాఫ్ట్ని అభిమానించే వాళ్ళు, ద్వేషించేవాళ్ళు. బహు కొద్ది మందిని మినహాయిస్తే, మిగతా వాళ్ళకి మొదటి రోజు చిరంజీవి సినిమా చూడటం లాగా, తిరుపతిలో రికమండేషన్ తో క్యూ లైన్లో దూరటం లాగా మైక్రొసాఫ్ట్ని ద్వేషించటం ఒక పిచ్చి అన్న మాట. ఆంగ్లంలో దీ ఇ ఇన్ ధింగ్ అంటుంటారు కదా అలాగ. వీళ్ళకి ఆపిల్ గాని, గూగుల్ గాని చిన్న డిలీట్ బటన్ అదనంగా చేర్చినా తీవ్రమైన ఉద్వేగానికి లొనైపొతూ ఉంటారు. ఇప్పుడు వీల్ల ప్రస్తావన ఎందుకు అంటే గూగుల్ వాడు 2010 చివర్లొ క్రోం పేరుతో ఒక ఆపరేటింగ్ సిస్టం ను విడుదల చేసే పనిలో ఉన్నానని ప్రకటించాడు. దాంతో మైక్రోసాఫ్ట్ చరమాంక దశకి చేరుకుందని ఆప్పుడే భజన మొదలు పెట్టేశారు. ఇలాంటి సాంకెతిక విషయాలలో పెద్దగా అవగాహన గాని, అవగాహన చేసుకునే ఉద్దేశంగాని పెద్దగా చూపించని మన భారతీయ పత్రికలు కూడా మక్కీ కి మక్కీ విదెశీ పత్రికలని అనువాదం చేసేసి మైక్రోసాఫ్ట్ కి బాబు రానున్నాడు అని పతాక శీర్షికలకి ఎక్కించేశారు. ఈ గొడవలొ అసలు గూగుల్ వాడి ఉద్దేశం ఏమిటి, వాడు ఏమి తయారు చేద్దామనుకుంటున్నాడు, అది నిజంగా మైక్రోసాఫ్ట్ కి పోటి కానుందా అని ఆలోచించిన వారు అంతర్జాతీయ మీడియాలొ కూడా చాలా తక్కువగా కనపడ్డారు. ఈ పొటీ గురించి వ్రాయటం లో ఆపిల్ గురించి మర్చిపొవటం గుడ్డిలో మెల్ల.

గూగుల్ వాడి ఉద్దెశం ఏమిటి? ఆథిక శాతం కంప్యూటర్లు అంతర్జాలం వాడకానికి, సంగీతం వినటానికి, వీడియో చూడటానికి మాత్రమే వాడబడుతున్నాయి. ఇలాంటి వాళ్ళకి ఉపయోగ పడేలాగా తయారు చెయబడిన నెట్ బుక్ ల వాడకం రోజు రోజుకు పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా టెలికాం ధరలు తగ్గే కొద్ది, వీటి వాడకం పెరుగుతుంది అని, అంటె కంప్యూటర్లో కేవలం అవసరమైన మేర మాత్రమే సామర్ధ్యం కలిగి ఉండి (మెమరి మొదలైనవి) మిగతా అన్ని పనులు (డాక్యుమెంట్లు వ్రాసుకోవటం, ఫైల్స్ సేవ్ చెసుకోవటం లాంటివి) అంతర్జాలం లొనే చేసుకుంటారని ఒక అంచనా. ఇప్పుడు ప్రాచుర్యం లో ఉన్న ఆపరేటింగ్ సిస్టంలు అన్ని ఎప్పుడో తయారైనవి. నెట్ బుక్స్ లో విరివిగా వాడబడుతున్న విండోస్ ఎక్స్పి కూడా ప్రత్యేకంగా ఇటువంటి ఉద్దెశంతో తయారు చేసినది కాదు. అందువలన వీళ్ళకి ఉపయొగపడేలాగా పరిమిత సామర్ధ్యంతో, వేగవంతంగా పని చేసే ఆపరేటింగ్ సిస్టం కి మార్కెట్ సిధ్ధం గా ఉంది. స్థూలంగా ఇది ఆలోచన.

ఇది కూడా ఇప్పుడప్పుడే కాదు. 2010 సంవత్సరం చివరికి విడుదల చెయబొతున్నట్టు చెప్పాడు. నెట్ బుక్ లలో నిజంగా ప్రాచుర్యం పొందితే అప్పుడు పూర్తి స్థాయిలో ఆపరేటింగ్ సిస్టం తయరు చేయచ్చు. గూగుల్ క్రోం విండోస్ కి పోటి కావటం అనేది ఒక ఐదు ఆరు సంవత్సరాల తరువాత మాట. అలాగె క్రోం ఆపరేటింగ్ సిస్టం యునిక్స్ పైన ఆధార పడి ఉంటుందని, పూర్తిగా ఉచితమని చెప్తున్నారు. ఇక్కడే ఉంది చిక్కు అంతా. ప్రపంచ వ్యాప్తంగా తొంభై శాతం దాకా సంస్థలు విండోస్ పైన ఆధార పడి ఉన్న కంపూటర్లని వాడుతున్నాయి. క్రోం విండోస్ ని ఓడించడం అంటె ఈ సంస్థల్లో యాభై శాతం అయినా క్రోం వాడటానికి సిధ్ధపడాలి. మరి ఉచితంగా లభ్యమయ్యే, సాంకేతిక నిపుణులు మాత్రమే వాడే ఆపరేటింగ్ సిస్టం గా పేరు గల యునిక్స్ మీద ఆధార పడే క్రోం ను వాడటానికి ఎక్కువ సంస్థలు ముందుకు వస్తాయని చెప్పటం కష్టమే. అలాగే ఈ ఆరు సంవత్సరాల సమయంలో విండోస్ ఎటువంటి అభివౄధ్ధి సాధించకుండా ఉంటుంది అని కూడా చెప్పలేము.


కాని క్రోం రంగంలొకి రావటం చాలా ముఖ్యమైన పరిణామం. ఏ రంగంలోనైనా పోటి వలన లాభపడేది వినియోగదారులే. అత్యున్నతమైన సాంకేతిక నైపుణ్యం కలిగిన గూగుల్ తప్పకుండా ఈ రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తుంది అని చెప్పవచ్చు. ఈది పూర్తిగా ఉచితం మరియు ఓపన్ సోర్స్ అవ్వటం వలన గూగుల్ వెలుపలి నిపుణులు కూడా దీనికి అనుబంధంగా పనిచెసే సాఫ్ట్ వేర్ని తయరు చేయగలుగు తారు. క్రోం ఆపిల్ యొక్క లెపర్డ్ లాగా యునిక్స్ మీద ఆధార పడటం వలన వైరస్ సొకే ప్రమాదం కూడా ఉండదు. క్రోం సాంకెతికంగా ఆపిల్ కి, ధరల పరంగా మైక్రోసాఫ్ట్ కి చక్కని పోటి ఇస్తుంది. దీని వలన చుక్కల్లో ఉన్న ఆపిల్ కంప్యూటర్ల ధరలు కూడా తగ్గితే చాలా బాగుంటుంది.

22.6.09

చిరంజీవి ద్రృక్పథంలో మార్పు

అప్పుడప్పుడు ఒపీనియన్స్ చేంజ్ చేయకపోతే పొలిటీషియనే కానేరడు!అని కన్యాశుల్కం నాటకంలో గిరీశం చెప్పిన మాట ఏకాలంలోనైనా వర్తిస్తుంది.సమయానుకూలంగా అభిప్రాయం మార్చుకోని రాజకీయ నాయకులు ఈనాడు దాదాపుగా లేరనే చెప్పవచ్చు.కొత్తగా రాజకీయాలలో ప్రవేశించిన చిరంజీవి సైతం 'పొలిటీషియన్ ' అనిపించుకున్నారు. అంటే ఆయన అభిప్రయాలు మార్చుకుంటున్నారని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.

అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరిగా పోటీచేసి ఖంగుతిన్న చిరంజీవి రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో విభిన్నమైన వ్యూహరచనకు ఉపక్రమిస్త్నట్టుగా తెలుస్తోంది. ఈసారి తప్పనిసరిగా పొత్తుపెట్టుకొని విజయావకాశాలు మెరుగుపరుచుకోవాలన్న ఆశ మెగాస్టార్లో పెరిగినట్టు కనిపిస్తోంది.ఏపార్టీతో పొత్తు పెట్తుకొంటే లాభసాటిగాఉంటుందనే అంశంపై పి.ఆర్.పి మల్లగుల్లాలు పడుతోంది. తెలుగుదేశం, టి.ఆర్.ఎస్,సి.పి.ఐ, సి.పి.ఎం పాతీలతో పొత్తుపెట్ట్కోవడానికి పి.ఆర్.పి చొరవ చూపించలేకపోతోంది.ఆనాలుగు పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో మహాకూటమిగా ఏర్పడి అభిఒప్రాయ భేధాలతో సతమతమై చిరంజీవికి భంగపడటం తెలిసిందే.అటువంటి పార్టీలతో పొత్తుకు చిరంజీవి సాహసించలేకపోవడంలో ఆశ్చర్యం లేదు.

ఇక లోక్ సత్తా,బి.జె.పి పార్టీలతో పొత్తు విషమై పి.ఆర్.పి. త్రీవ్రంగా ఆలోచిస్తున్నట్తు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బి.జె.పి.తో పొత్తు విషయమై చిరజీవి ప్రకటించిన అభిప్రాయం ఈసందర్భంలో గుర్తు తెచ్చుకోవడం అవసరం.తమది సెక్యులర్ పార్టీ అనీ మతమత్వపార్టీలతో పొత్తు పెట్టుకొనే ప్రసక్తి లేదని అప్పట్లో చిరంజీవి సెలవిచ్చారు. ఇప్పుడు ఆయన అలోచనలో తేడా కనిపిస్తోంది.ఎదైనా అంటే రాజఖీయాలలొ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉందరని సిధ్ధాంతీకరిస్తూ తమ చర్యను సమర్ధించుకోవడానికి ప్రయత్నించడం రాజకీయ నాయకులలు పరిపాటి. మిత్ర,శత్రుత్వాలు శాశ్వతం కాకపోయినా సెక్యులరిజం అనే సిధ్ధాంతం మాత్రం తాత్కాలికం కాకూడదన్న సిధ్ధాంతాన్ని చిరంజీవి మరిచిపోకోడదు.

ఇక లోక్ సత్తా పార్టీతోపొత్తుకు చిరంజీవికి అభ్యంతరం ఉండకపోవచ్చు.కాని లోక్ సత్తా అథినేత జయప్రకాష్ నారయణకు మాత్రం పి.ఆర్.పి.తో పొత్తు విషయంలో అభ్యంతరాలు ఉండే అవకాశం ఉంది. ఎందువల్లనంటే కుటుంబపాలనకు అవకాశం ఇచ్చే పార్టీలకు ఓటు వేయద్దని ఎన్నికలకు ముందు గట్టిగా ప్రచారం చేశారు.కానీ ఆయన వాదనను ప్రజలు అంతగా పట్టించుకొన్న జాడలేదు.

ప్రజారాజ్యం పార్టీలో ఒక కుటుంబమే పెత్తనం సాగిస్తోందని భావిస్తున్న పెద్దమనిషి (జయప్రకాష్ నారాయణ్) ఇప్పుడు తన అభిప్రాయాలను మార్చుకుంటారా? అవసరార్థం పి.ఆర్.పి స్నేహపూర్వక ఆహ్వానాన్ని మన్నిస్తారా? అవకాశవాదంలో లోక్ సత్తకు,ఇతర పార్టీలకు తేడాలేదని నిరూపిస్తారా? అభిప్రాయాన్ని మార్చుకుని తాను కూడా చిరంజీవి వంటి పొలిటీషియనేనని ౠజువు చేసుకుంటారా?

ఎవరు నిజమైన పొలిటీషియన్ అన్న విషయాన్ని కాలమే బయటపెడుతుంది.అంతవరకు వేచి చూడవలిందే.అసలు ఈ ఆలోచనలన్నీ ప్రక్కన పెట్టి కాంగ్రెసుతో పొత్తు పెట్టుకొంటే చిరంజీవి రాజకీయవేత్త అని అందరూ అంగీకరిస్తారు.

కుటుంబపాలన,వారసత్వపాలన గురించి ఇటీవల వస్తున్న విమర్శల గురించి కాస్త చర్చించడం అవసరం.ప్రస్తుతం కొన్ని ప్రధానపార్టీలలో ఆయాపార్తీల అథినేతల కుటుమబాలు మాత్రమే పెత్తనం చలాయిస్తున్నాయనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.ఈవిమర్శకి తావు లేని విధంగా ఆపార్టీలు వ్యవహరించకపోతే ప్రజాభిమానం సన్నగిల్లే ప్రమాదం ఉంది.

ఇక వారసత్వ రాజకీయం గురించి ఒక ప్రధాని కుమారుడు ప్రధాని అవడానికి అర్హుడా,కాదా అన్న విషయాన్ని ప్రజలేనిర్ణయించాలి,ఆయా పార్టీల పెద్దలు కాదు. మరోరకంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలా,వద్దా అనే విషయంపై తీర్పు చెప్పే అధికారం ప్రజలకు ఉంటుంది.కాని సోనియాగాంధీకి లేదా కాంగ్రెస్ పార్టీకి కాని ఆహక్కు ఉండదు.కనుక ప్రజాభిమానమే పరిపాలకుని అర్హత నిర్ణయిస్తుంది కాని పుట్టుక కాడు. ప్రధాన మంత్రి కుమారుడైన మాత్రాన పదవి చేపట్టడానికి అర్హుడని,అనర్హుడని కాని నిర్ణయించడం తగదు.ప్రజల మనిషిగా పేరు తెచ్చుకొన్నవారెవరైనా దేశాధినేత కావచ్చు.ఇది ప్రజాస్వామ్య లక్షణం.దీన్ని కాపాడవలసిన భాధ్యత అందరిపై ఉంది.

రమేష్

12.6.09

ఆత్మవిమర్స చేసుకొనేవిధానం ఇదేనా?

ఓడిపోయిన పార్టీలు ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకోవడం ఎంతైనా అవసరం. ఫలితాల విశ్లేషణ ద్వారా ఆయా పార్టీలు ఆత్మవిమర్స చేసుకొని,తమ తప్పులను సరిదిద్దుకుని భవిష్యత్తులో విజయానికి రాచబాట వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాని తెలుగుదేశం పార్టీ ఇటీవల జరిపిన ఎన్నికల విశ్లేషణలో ఆత్మవిమర్సను పూర్తిగా విస్మరించింది.పైగా ఆత్మస్తితి,పరనింద ప్రధాన లక్ష్యాలుగా ఎన్నికల ఫలితాలపై తెలుగు దేశం పార్టీ వ్యాఖ్యానాలు చేయడం విడ్డూరం. కొత్తగా వచ్చిన లొక్ సత్తా,ప్రజారాజ్యం పార్టీలు ఓట్లను చీల్చడం వల్లనే తాము ఓడిపోయామని, ఆపార్టీలు లేకపోతే తాము గెలిచి ఉండేవారమని తెలుగుదేశం పార్టీ అథినేత చంద్రబాబునాయుడు సెలవిచ్చాలు.తమ పార్టీ జయాపజయాలను పార్టీలు నిర్దేశిస్తాయనుకుంటే అంతకంటే అఙ్ఞానం మరొకటిలేదు. ప్రజాదరణ ఒక్కటే ఏపార్టీకైనా శ్రీరామరక్ష. ప్రజల అభిమానం పొందగలిగిన పార్టీలను రాజకీయశక్తులు ఏమీచేయలేవు. కొత్తగా వచ్చిన రాజకీయపార్టీలు తెలుగుదేశంపార్టీ ఓట్లను మాత్రమే ఎందుకు చీల్చాయి? కాంగ్రెసు ఓట్లను ఎందుకు చీల్చలేదు? అనే ప్రశ్నకు చంద్రబాబునాయుడుగారు జవాబు చెప్పలేదు. 2004 సంవత్సరం నాటి ఎన్నికలలో కాంగ్రెసు 38.56 శాతం, తెలుగుదేశం పార్టీకి 37.59 శాతం ఓట్లు లభించాయి. కాగా 2009 నాటి ఎన్నికలలో కాంగ్రెసు కి 36.56 శాతం,టిడిపి కి 28.12 శాతం లభించాయి.అంటే గతేన్నికలలో కంటే ఈఎన్నికలలో తెలుగుదేశంపార్టీకి ఓట్లశాతం గణనీయంగా తగ్గింది.ఈవిషయంలో కాంగ్రెసు పరిస్థితి టిడిపికన్నా మెరుగ్గా ఉంది. అంటే కొత్తపార్టీలు టిడిపి విజయావకాశాలను దెబ్బతీశాయి. కాని కాంగ్రెసు ఫలితాలపై అంతగా ప్రభావం చూపలేకపోయాయి. తెలుగుదేశంపార్టీ గతంలోకంటే ప్రజాదరణను కోల్పోయిందనే విషయాన్ని ఈ గణాంకాలు స్పష్టంగా సూచిస్తున్నాయి.

కొత్తపార్టీలు ఆవిర్భవించడమే తప్పు అనేధోరణిలో చంద్రబాబునాయడుగారు మట్లాడుటం మరొక విచిత్రం. ప్రజాసౌమ్య వ్యవస్తలో కొత్తపార్టీలను స్ట్ధాపించుకొనే హక్కు ఎవరికైనాఉంది.కనుక ఫలానాపార్టీలు లేకపోతే తమకు విజయం వరించి ఉండేదని చంద్రబాబు వ్యాఖ్యనించడం ప్రజాసౌమ్య విరుధం.ప్రజాదరణ కోల్పోవడం వల్ల తాము ఓడిపోయామని గ్రహించకుండా తమ పరాజయానికి కొత్త పార్టీలు ఆవిర్భావం, ఇవియం ల వినియోగం కారణమని చంద్రబాబు పేర్కొనడం ఆత్మవంచన తప్ప మరొకటి కాదు. ఇటువంటి ఆలోచనాధోరణై పార్టీ ప్రతిష్టను మరింత దిగజారుస్తుందే తప్ప విజయపథం వైపుకు నడిపించడానికి దోహదం చేయదు.సమ్యమనం కోల్పోయి ఇటువంటి అసంగతమైన వ్యాఖ్యాలు చేయడం మాజీ ముఖ్యమంత్రి, అసెంబ్లీలో ప్రతిపక్షనేత అయిన చంద్రబాబునాయుడుకి ఎంతమాత్రము తగదు. అసలు తెలుగుదేశంపార్టీ ఆవిర్భవించకపోతే రాష్ట్రంలో తమపార్టీకి ఎదురేఉందేది కాదని కాంగ్రెస్స్ నాయకులు వాదిస్తే ఎలాఉంటుందో ఒక్కసారి ఆలొచిస్తే బాబుగారి కి తెలుస్తుంది. అయితే మరొక్కవిషయం ఈసందర్భంలో తప్పనిసరిగా ఆలోఅచించాలి.మైనారిటీ ఓట్లలో(36.56 శాతం)కాంగ్రెస్స్ అధికారాన్ని చేపట్టిందనే విమర్శసత్యదూరం కాదు. కాంగ్రెస్స్ కు 36.56శాతం ఓట్లు మాత్రమె వచ్చాయంటే 63.44 శాతం మంది ఆపార్టీని వ్యతిరేకించారని అర్ధం. సమర్ధించిన వారికంటే వ్యతిరేకించిన వారు అధికారం కట్టబెట్టుడం సమంజసమా అనే వాదనలు విస్త్రుతంగా వినిపిస్తున్నాయి. ఈరకంగా ఆలోచిస్తే చాలాకాలంగా మనదేశంలో రాజకీయపార్టీలు అధికారం చేపడ్డానికి అర్హతను సాధించలేపోతున్నాయి అని చెప్పవలివస్తుంది. ఉదాహరణకు తెలుగు దేశంపార్టీ 28.12 శాతం ఓట్లు అనికూలంగా వచ్చాయి.71.38 శాతం ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి.అటువంటి పార్టీకి కాంగ్రెస్స్ అర్హతను ప్రశ్నించే హక్కు ఉంటుందా? కనుక ఓట్లశాతాన్ని బట్టిగాక సీట్ల శాతం (సంఖ్యకు) బట్టి అధికార అర్హతను నిర్ణయించడం జరుగుతోంది.

అయితే మనదేశంలో మైనారిటి ఓట్లు వచ్చిన పార్టీలు అధికారాన్ని ఎలా చేపట్టగలగుతున్నాయి అనేప్రశ్నను నిర్లక్ష్యం చేయకూడదు. మనరాష్ట్రంలో అధికార పార్టీకి 36.56, తెలుగుదేశం పార్టీకి 28.12 మిగిలిన అన్ని పార్టీలకు కలిపి 35.32 శాతం ఓట్లు లభించాయి.2004నాటి ఎన్నికలలో కాంగ్రెసు కు 38.56,తెలుగుదేశంకి 37.59 ఇతర పార్టీలకు 23.85 శాతం ఓట్లు లభించాయి.2004 లో కంటే ఈసారి అధికార,ప్రతిపక్షపార్టీలకు ఓట్లు శాఅతం తగ్గడం స్పష్టంగా కనిపిస్తోంది.మరోరకంగా చెప్పాలంటే ఈరెండుపార్టీలకు గతంలోకంటే ఇప్పుడు ప్రజాదరణ తగ్గింది.కొత్తపార్టీల వల్ల తమకు ప్రజాదరణ తగ్గింది అనడం హాస్యాస్పదం.మరొకరకంగా చెప్పాలంటే రాష్ట్రంలోని ప్రధానపార్టీలు ప్రజాదరణ కోల్పోవడం వల్లనే మైనారిటీఓట్లు వచ్చినపార్టీలు గద్దెనెక్కడం అనేవైపరీత్యం సంభవించిందన్నమాట. అలాగాక అధికారపార్టీ 60శాతం ఓట్లు సాధించగలిగిటే మిగిలినపార్టీలు 40శాతం ఓట్లను పంచుకోవలసివచ్చేది.అప్పుడు మెజారిటీ ఓట్లు వచ్చిన పార్టీకే అధికారపీఠం దక్కిఉందేది. కాని అంతటి ప్రజాదరణ పొందగలిగే స్ఠాయికి మన పార్టీలు ఎదగలేదనేది స్పస్ఠం. ఆస్ఠాయికి ఎదగడానికి ఇప్పటికైనా మనపార్టీలు ప్రయత్నిస్తే మైనారిటీ ఓట్లతో అధికారాం చేపట్టారనే నింద పడకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ప్రజాదరణ పొందడానికి బహుపార్టీ వ్యవస్ఠ అడ్డురాదు.

బహుపార్టీ వ్యవస్థతో గందరగోళం

అయితే ఒకపార్టీ వ్యవస్థ దేశంలో గందరగోళాన్ని, అస్తవ్యస్తాన్ని స్రుష్థిస్తోందన్న వాదనలో కొంతనిజం లేకపోలేదు.కాని కొత్తపార్టీల ఏర్పాటును ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యంలో ఎవరికిలేదనడం నిర్వివాదాంశం.కాని రాజకీయ పార్టీల పనితీరును క్రమబధ్ధం చేయడానికి, కొన్ని నియమాలను రూపొందిచడానికి,అవసరమైతే కొత్త చట్టాలను తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గుర్తింపుకోరే కొత్త రాజకీయపార్టీలు ఆర్ధిక,పారిశ్రామిక,వ్యవసాయిక మరియు విద్యా తదితర రంగాలపై స్పష్టమైన విధానాలు రూపొందించి ఎన్నికల కమీషనరుకు లేదా ప్రభుత్వానికి సర్పించాలనే నిభంధన విధించాలి.దేశ సమగ్రతకు,సమైకానికి, స్వాతంత్రానికి,సార్వభౌమత్వానికి, ప్రజాస్వామ్యా వ్యవస్థకు భంగం కలింగించని రీతిలో ఈవిధానాలు ఉండాలి. ఒక్కమాటలో చెప్పాలంటే భారతరాజ్యాంగానికి లోబడి ఈవిధానాలు ఉండాలి.ఇటువంటి విధానాలను అందించే పార్టీకి మాత్రమే ఎన్నికలలో గుర్తింపు ఇవ్వాలి. భవిష్యత్తులో ఈనిబంధనలు ఉల్లంఘించే పార్టీల గుర్తింపును రద్దు చేసే హక్కు కూడా ప్రభుత్వానికి ఉండాలి.ఇలాంటి నిభంధనలు విధిస్తే రాజకీయ పార్టీలలో క్రమశిక్షణ,భాధ్యత పెరిగే అవకాశం ఉంటుంది. కనుక మనదేశంలో మేధావులంతా ఈదిశగా ఆలోచనలు సాగించడం అవసరం.అయితే పార్టీ సిధ్ధాంతాలు ఐదేళ్ళకొకసారి మారిపోకోడదు.ఈ సిధ్ధాంతాలకుగుణంగా ఎన్నికిల ప్రణాలికలో కొత్తకొత్త ప్రణాలికలను రూపొందించుకోవచ్చు.ప్రజాకర్షక పధకాలు దేశాభివ్రుధ్ధికి దోహదంచేయవనే విషయాన్ని కూడా మరిచిపోకూడదు. అధికారం లేకపోయినా ప్రజాసేవ చేయడానికి ఏవిధమైన అభ్యంతరం లేదనే అంశాన్ని రాజకీయపార్టీలు సర్వదా గుర్తుంచుకోవాలి.

ఐదేళ్ళ తర్వాత తమ పార్టీ మళ్ళీవిజయాన్ని సాధించి రికార్దు స్రుస్థించిందని కాంగ్రెసు వాదులు చేసుకొంటున్న ప్రచారాన్ని కూడా ఒక్కసారి పరిశీలించడం అవసరం. ఐదేళ్ళ పదవీకాలాన్ని పూర్తిచేసిన తర్వాత మళ్ళీ అధికారాన్ని చేపట్టిన తొలి ముఖ్యమంత్రిగా డా.రాజశేఖర్ రెడ్డి చెరిత్ర స్రుస్థినచారని కాంగ్రెసు వాదులు గొప్పగా చెప్పుకొంటున్నారు.నిజానికి ఇది గర్వకారణం కాదు.ఎందువల్లనంటే ఆంధ్రరాష్ట్ర ఏర్పడిన తర్వాత 53ఏళ్ళ వరకు కాంగ్రెసు ముఖ్యమంత్రి ఎవరూ ఐదేళ్ళ పదవీకాలాన్నీ పూర్తి చేయలేదంటే అది ఆపార్టీకి సిగ్గు చేటుకాదా. ఐదేళ్ళ కాలంలో ముగ్గురు లేదా నలుగురు ముఖ్యమంత్రులను మారిచిన ఘనచరిత్ర కూడా కాంగ్రెసుకు ఉంది.దానినే దివంగత మాజీముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు కాంగ్రెసు సంస్క్రుతిగా పేరుకొన్నేవరు. అటువంటి సంస్క్రుతి నుండి బయటపడటమే కాంగ్రెసు చరిత్రలో నిజంగా గొప్పవిషయంగా చెప్పుకోవాలి.రాష్ట్రాన్ని 37ఏళ్ళు కాంగ్రెసు,16ఏళ్ళు తెలుగుదేశం పరిపాలించగా తెలుగుదేశంపార్టీకి చెందిన చంద్రబాబునాయుడు ఎక్కువకాలం పరిపాలించిన ముఖ్యమంత్రిగా రికార్డు స్థాపించడం మరొకవిచిత్రం.

53ఏళ్ళ తర్వాత ఒకకాంగ్రెసు ముఖ్యమంత్రి రికార్డ్ సాధించడానికి కారణాలు విశ్లేషించాలి. వై.ఎస్.ఐదేళ్ళ పాలనలో రాష్ట్రకాంగ్రెసులో అసంత్రుప్తి అధికంగా లేకపోవడం, చేపట్టిన ప్రాజెక్టులపై ప్రజలు సంత్రుప్తి ప్రకటించడం ఆపార్టీ విజయాలుగా చెప్పుకోవచ్చు. శ్రీ రాజశేఖరరెడ్డికి రెండవసారి అధికారం లభించడానికి ఇదికూడా ఒకకారణం కావచ్చు. కాంగ్రెస్స్ విజయానికి ప్రతిపక్షాలు వైఫల్యం కూడా ఒకకారణం.విపక్షంగా కొనసాగిన ఐదేళ్ళలో అధికారపార్టీకి వ్యతిరేకంగా ప్రజాభిమానాన్ని పొందదంలో తెలుగుదేశంపార్టీ విఫలమయింది.కేవలం ఒకటి,రెండు నినాదాలను వల్లెవేయడం పైనే ద్రుష్టిని కేంద్రీకరించిన ప్రజారాజ్యంపార్టీ ప్రజభిమానాన్ని చూరగొనలేకపోయింది. కేవలం ప్రత్యేకతెలంగాణా ఒక్కటే లక్ష్యంగా పోటీచేసిన టి.ఆర్.ఎస్. విధానాన్ని ప్రజలు హర్షించలేదు.ఈవిషయాలు ద్రుష్టిలో ఉంచుకొని ఇటు ప్రతిపక్షాలు,అటు కాంగ్రెస్స్ తమ భవిష్యత్తు కార్యక్రమాలను రూపొందించుకోవాలి.

ఇకకేంద్రంలో మన్మోహన్ సింగ్ సాధించిన విజయానికి ప్రతిపక్షాల వైఫల్యము,అనైక్యత ప్రధానకారణాలు.ఏదిఏమైనా ప్రజాసంక్షేమాన్ని ద్రుష్టిలో ఉంచుకొని ముందుకుసాగే పార్టీలకు మాత్రమే మంచి భవిష్యత్తు ఉంటుంది.

ఎం.వి.రమేష్